చికెన్ తింటే కరోనా వస్తుందా. చికెన్ ధరలు మల్లి తగ్గాయి 

చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పరిశ్రమను అతాలకుతలాం చేస్తోంది. కరోనా వైరస్ వదంతులతో రోజురోజుకు చికెన్ ధరలు పడిపోతున్నాయ్. గత ఇరవై రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వస్తోన్నాయ్. కరోనా ఎఫెక్ట్ వల్ల చికెన్ కంటే రైతు బజారులో కూరగాయల ధరలే ఎక్కువగా ఉంటున్నాయ్. విశాఖ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది
. సరిగ్గా నెల రోజుల క్రితం కిలో చికెన్ 2 వందల రూపాయలు ఉండేది. ప్రస్తుతం సగం కంటే తక్కువ ధరకే పడిపోయింది. చికెన్ తింటే కరోనా వస్తుందనే భయమే జనాన్ని వెంటాడుతోంది. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు.

ఉత్తరాదితో పోల్చుకుంటే కరోనా వైరస్ వదంతులు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా చికెన్‌కు డిమాండ్ అమాంతం పడిపోయింది. హోటళ్లలో కూడా చికెన్ ఆర్డర్లు తక్కువగానే ఉంటున్నాయి. హోటళ్లు చికెన్ కొనుగోళ్లను గతంలో కంటే బాగా తగ్గించేశాయి. కరోనా వైరస్ ప్రచారానికి ముందు సాధారాణ రోజుల్లో విశాఖలో రోజుకు లక్షా25 వేల కిలోల చికెన్ అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు సాధారణ రోజుల్లో 40 నుంచి 50 వేల కిలోలు, ఆదివారాల్లో లక్ష కిలోలకు మించి వ్యాపారం జరగడం లేదు. విశాఖ నగరంలోనే కాకుండా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోను చికెన్ అమ్మకాలు పడిపోయాయి. డిమాండ్ లేదని ఇలా అయితే తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ తింటే వైరస్ సోకుతుందనే వదంతులు నమ్మవద్దని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ అతి శీతల వాతావరణంలో మాత్రమే వ్యాప్తిచెందుతుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 30 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న విషయాన్ని కూడా గుర్తించాలని కోరుతున్నారు. కోళ్లకు ఎలాంటి వైరస్ సోకదని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దంటూ హితవు పలుకుతున్నారు. నిజానికి ఒకప్పుడు ఆదివారం ఎప్పుడొస్తుందా అని జనం ఎదురు చూసేవారు. చికెన్‌తో వెరైటీ వంటకాలు ఎన్ని చేయాలో అని ఆలోచిస్తుండేవారు. ఇప్పుడు మాత్రం కరోనాకు భయపడి పూర్తిగా చికెన్‌కు దూరంగానే ఉండిపోతున్నారు. ఫలితంగా రైతు మార్కెట్‌లో కూరగాయల ధరల కంటే చికెన్ చవకగా లభిస్తుంది. తద్వారా చికెన్ వ్యాపారులకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. మొత్తానికి కరోనా వైరస్‌ దెబ్బ ఫౌల్ట్రీ రంగానికి గట్టిగానే తగులుతోంది.